అరటి కాయ రోటి పచ్చడి

7

అరటి కాయ రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు 

అరటి కాయలు —- 2
పెద్ద ఉల్లిపాయలు —- 2
పచ్చిమిరపకాయలు —– 4
కరివేపాకు —– 3 రెమ్మలు
కొత్తిమీర —– మరి కాస్త ఎక్కువ .

పోపు పెట్టడానికి  కావలసిన పదార్ధాలు

నూనె -రెండు స్పూన్లు .
ఎండు మిరపకాయలు – 5
చాయ మినపప్పు – స్పూనున్నర
ఆవాలు – అర స్పూన్
ఇంగువ -తగినంత
పసుపు -కొద్దిగా
ఉప్పు – తగినంత .

అరటి కాయ పచ్చడి తయారు చేయు విధానము .

ముందు ఉల్లిపాయలు పై పొట్టు తీసి చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .ఇప్పుడు అరటికాయలు శుభ్రంగా కడిగి పొడిగా గుడ్డ పెట్టి తుడవండి.అరటి కాయల చెక్కు తీయవద్దు.ఇప్పుడు స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టండి.అరటికాయలు మీద నూనె రాయనక్కరలేదు .ఆ రెండు అరటి కాయలు వంకాయలు రోటి పచ్చడికి కాల్చినట్లు కాల్చండి .పై చెక్కు నల్లగా అయి చేతితో పట్టుకొని చూస్తే లోపల మెత్తగా అవుతుంది .గిన్నెలో నీళ్ళు పెట్టుకుని చేతులు తడి చేసుకుంటూ ఆ కాయల పై చెక్కు తీసేయండి .ఇప్పుడు స్టౌ మళ్ళీ వెలిగించి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక అందులో చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పోపు బాగా వేగాక అందులో కరివేపాకు , పచ్చిమిరపకాయలు వేసి రెండు నిముషాలు ఉంచి స్టౌ ఆపేయండి .సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించవద్దు .పోపు చల్లారాక రోటిలో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు , పసుపు కొద్దిగా వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోండి .తర్వాత రోటిలో కాలిన అరటి కాయలు ,పచ్చి మిరపకాయలు ,
వేగిన కరివేపాకు వేసి మరోసారి పచ్చడి బండతో దంపుకోండి .అరటికాయలు బాగా కాలి ఉంటాయి కాబట్టి కొద్దిగా దంపుకుంటే చాలు పచ్చడి మెత్త పడుతుంది .ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన పోపు , కొత్తిమీర సన్నగా తరిగి చేత్తోనే బాగా కలుపుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.అంతే పసందైన అరటి కాయ పచ్చడి భోజనం లోకి సిద్ధం.ఇందులో ఉల్లిపాయలు పచ్చివి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది .