గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలుతో రోటి పచ్చడి

7

గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలుతో రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు

గోంగూర — మూడు కట్టలు
పండుమిరపకాయలు — 150 గ్రాములు .
చింతపండు — 50 గ్రాములు .
మెంతిపిండి — రెండు స్పూన్లు .
ఉప్పు — తగినంత
పసుపు — స్పూను
ఉల్లిపాయలు — మూడు .

పోపు పెట్టడానికి  కావలసిన పదార్ధాలు

ఎండుమిరపకాయలు — 4 ముక్కలుగా చేసుకోవాలి .
నూనె — 150 గ్రాములు .
చాయమినపప్పు — స్పూనున్నర .
ఆవాలు — స్పూను .
ఇంగువ — తగినంత

తయారు చేయు విధానము

ముందుగా పండు మిరపకాయలు ఒకసారి కడుగుకుని , తొడిమలు తీసుకుని పొడి గుడ్డతో తుడుచుకుని నీడలో ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి .తర్వాత రోటిలో పండుమిరపకాయలు , చింతపండు , పసుపు , కొద్దిగా పచ్చిఇంగువ మరియు సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరుగు కోవాలి .గోంగూర కట్టలు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి , ఆకులు వలుచుకుని పూర్తిగా తడి పోయేవరకు నీడలో ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి .ఆ తర్వాత బాండీలో నూనె వేయకుండా వేయించుకోవాలి .ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయల ముక్కలుగా చేసి , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ వేసి పోపు వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .

ఒక అయిదు నిముషములు పోపు చల్లారనివ్వాలి .ఇప్పుడు రోటిలో వేయించి సిద్ధంగా ఉంచుకున్న గోంగూర , రోటిలో దంపిన పండుమిరపకాయల ముద్ద , మెంతి పొడి మరియు సరిపడా ఉప్పు వేసుకుని ఈ రెండు బాగా కలిసే వరకు మెత్తగా పచ్చడి బండతో దంపుకుని నూరుకోవాలి .ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేయించి సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయల లో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .కొంతమంది ఉల్లిపాయలు ముందు వేయించి వేయకుండా అవసరమైన మేరకు పచ్చడి తీసుకుని ఉల్లిపాయలు వేయించి కలుపుకుంటారు .మరి కొంతమంది పచ్చి ఉల్లిపాయలు , నాలుగు పచ్చిమిరపకాయలు మరియు పది వెల్లుల్లి రెబ్బలు రోటిలో తొక్కుకుని ఈ పచ్చడి కూడా కలిపి నూరుకుంటారు.వెల్లుల్లి ఇష్టమైన వారు అలా కూడా చేసుకోవచ్చును .తర్వాత వేరే జాడీలోకి కాని లేది కంటైనర్ లోకి గాని తీసుకుని భద్రపరుచుకోవాలి .ఈ పచ్చడి మనం చేసుకునే విధానమును పట్టి షుమారు వారం నుండి రెండు వారముల వరకు నిల్వ ఉంటుంది .గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలతో చేసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .