చుక్కకూర రోటి పచ్చడి

20

చుక్కకూర రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు

చుక్క కూర – ఒక కట్ట
పచ్చిమిరపకాయలు – 5
ఎండు మిరపకాయలు – 3
చాయ మినపప్పు – ఒక స్పూన్
ఆవాలు – అర స్పూను
ఇంగువ – చిటికెడు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – నాలుగు స్పూన్లు

తయారు చేయు విధానము

ముందుగా చుక్క కూరను శుభ్రం చేసుకుని ఒకసారి నీళ్ళల్లో బాగా కడిగి, చాకుతో వేళ్ళు తీసేసి ఆకును మరియు కాడలను కట్ చేసుకోవాలి .తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి , నూనె బాగా కాగాక , తరిగిన చుక్క కూర , పచ్చి మిరపకాయలు , పసుపు కొద్దిగా వేసి మూతపెట్టి ఆకును మగ్గ నివ్వాలి .మగ్గిన తర్వాత పళ్ళంలో విడిగా తీసుకోవాలి.ఆ తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకుని వరుసగా ఎండు మిరపకాయలు ,చాయ మినపప్పు , ఆవాలు , ఇంగువ వేసుకుని పోపు వేసుకోవాలి.పోపు చల్లారిన తర్వాత ముందుగా ఎండు మిరపకాయలు , తగినంత ఉప్పు , కొద్దిగా పసుపు రోటిలో వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి .ఆ తర్వాత మగ్గ పెట్టిన చుక్కకూర , పచ్చిమిరపకాయలు , పోపు వేసి బండతో మరీ పేస్ట్ లా కాకుండా పచ్చడి బండతో ఫోటోలో చూపిన విధముగా పైపైన నూరుకోవాలి. వేరే గిన్నెలోకి తీసుకోవాలి .చుక్కకూర సహజంగా పులుపు ఉంటుంది కనుక చింతపండు వేయనవసరం లేదు.అంతే నోరూరించే చుక్క కూర పచ్చడి సిద్ధం.ఈ పచ్చడి అన్నం లోకి , దోశెలలోకి మరియు చపాతీలలోకి కూడా బాగుంటుంది .