దొండకాయ టమోటో రోటి పచ్చడి

18

దొండకాయ టమోటో రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు 

దొండకాయలు — 200 గ్రాములు .
టమోటోలు దోరవి — మూడు .
పచ్చిమిరపకాయలు — పది
చింతపండు — చిన్న నిమ్మకాయంత
పసుపు — కొద్దిగా
ఉప్పు — తగినంత
కరివేపాకు — మూడు రెమ్మలు
కొత్తిమీర — చిన్న కట్ట .

పోపు పెట్టడానికి  కావలసిన పదార్ధాలు

నూనె — షుమారు 50 గ్రాములు .
ఎండుమిరపకాయలు — 8
మినపప్పు — స్పూను
మెంతులు — పావు స్పూను.
ఆవాలు — అర స్పూను
జీలకర్ర — పావుస్పూను
ఇంగువ — చిటికెడు

తయారు చేయు విధానము

ముందుగా చింతపండు విడదీసి , చాలా కొద్ది నీళ్ళలో పది నిముషాలు తడిపి ఉంచుకోవాలి .దొండకాయలు ముక్కలుగా తరుగు కోవాలి .టమోటో లు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి .స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే మూడు టమోటోలు కాయల పళంగా నూనెలో వేసి మూత పెట్టి మగ్గ నివ్వాలి .

టమోటోలు మగ్గిన తర్వాత వేరే పళ్ళెంలో తీసుకోవాలి .తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే దొండకాయముక్కలు , పచ్చిమిర్చి మరియు కొద్దిగా పసుపు బాండిలో వేసి మూతపెట్టి మీడియం సెగన మగ్గనివ్వాలి .తర్వాత వీటిని వేరే పళ్ళెంలో తీసుకుని ఉంచుకోవాలి .తిరిగి బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , మెంతులు, మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .తర్వాత ముందుగా రోటిలో లో ఎండుమిరపకాయలు , చింతపండు , దొండకాయ ముక్కలు , పచ్చిమిర్చి తగినంత ఉప్పు మరియు చింతపండు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .తర్వాత మిగిలిన పోపు , మగ్గపెట్టి విడిగా ఉంచిన టమోటోలు మరియు కొత్తిమీర కూడా వేసి మరీ మెత్తగా కాకుండా పచ్చడి బండతో నూరుకోవాలి .తర్వాత ఈ పచ్చడి విడిగా వేరే గిన్నెలో తీసుకోవాలి .అంతే ఎంతొ రుచిగా ఉండే దొండకాయ టమోటో రోటి పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.