నువ్వుపప్పు రోటి పచ్చడి

4

నువ్వుపప్పు రోటి పచ్చడి

తయారు చేయు విధానము

ఈ పచ్చడి తయారు చేయడానికి తెల్లనువ్వు పప్పు చాలా బాగుంటుంది .తెల్ల నువ్వులు వేరు తెల్ల నువ్వుపప్పు వేరు .స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి పది ఎండుమిరపకాయలు , పావు స్పూను మెంతులు , అర స్పూను ఆవాలు మరియు కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి .

ఒక 50 గ్రాముల చింతపండు పావు గ్లాసు నీళ్ళలో పది నిముషాలు తడిపి ఉంచుకోవాలి .ఒక 75 గ్రాముల తెల్ల నువ్వు పప్పు , నూనె వేయకుండా బాండీలో కమ్మని వాసన వచ్చేదాకా వేయించు కోవాలి .చల్లారిన తర్వాత వేయించిన నువ్వుపప్పు రోటిలో వేసి పచ్చడి బండతో మెత్తని పొడిగా దంపుకోవాలి .పొడిని విడిగా ప్లేటులోకి తీసుకుని ఉంచుకోవాలి .ఇప్పుడు రోటిలో లో సరిపడా ఉప్పు వేగిన ఎండుమిరపకాయలు , కొద్దిగా పసుపు వేసుకుని మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .తర్వాత మిగిలిన పోపు , చింతపండు నీళ్ళతో సహా మరియు కొంచెం బెల్లం వేసి మెత్తగా పచ్చడి బండతో నూరుకోవాలి .

ఇప్పుడు  సిద్ధంగా ఉంచుకున్న నువ్వుల పొడి కూడా వేసి మరోసారి మెత్తగా బండతో నూరుకోవాలి .ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి అన్నింటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .