బీరకాయ రోటి పచ్చడి

8

బీరకాయ రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు

లేత బీరకాయలు — మూడు.
పచ్చిమిరపకాయలు — 6
చింతపండు — చిన్న నిమ్మకాయంత .
కొత్తిమీర — ఒక చిన్న కట్ట
పసుపు — చిటికెడు
ఉప్పు — తగినంత

పోపు పెట్టడానికి  కావలసిన పదార్ధాలు

నూనె — ఐదు స్పూన్లు
ఎండుమిరపకాయలు — 6
మినపప్పు — స్పూనున్నర
మెంతులు — పావు స్పూను
ఆవాలు — అరస్పూను
జీలకర్ర — పావు స్పూను
ఇంగువ — కొద్దిగా
కరివేపాకు — మూడు రెమ్మలు

తయారు చేయు విధానము

బీరకాయలు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి . లేత బీరకాయలు అయితే పైచెక్కుతోనే ముక్కలుగా తరుగుకోవచ్చును .పదినిముషాల ముందు చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .స్టౌ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు , మరియు పచ్చిమిరపకాయలు కాయలు వేసి మూతపెట్టి బీరకాయలను బాగా మగ్గనివ్వాలి .తరువాత వాటిని వేరే ప్లేటులో తీసుకోవాలి .మరల స్టౌ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .పోపు చల్లారగానే ముందుగా రోటిలో ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , పచ్చిమిరపకాయలు , మరియు తగినంత ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా తొక్కు కోవాలి .తర్వాత బీరకాయముక్కలు , మిగిలిన పోపు మరియు కొత్తిమీర వేసి పచ్చడి బండతో బాగా నూరుకోవాలి .తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పైన పోపు పెట్టుకోవాలి .అంతే . ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి దోశెలు , గారెలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .